సింధుకు హైదరాబాద్‌ హంటర్స్‌ ఘన సన్మానం

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధును పీబీఎల్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ టీమ్‌ ఘనంగా సన్మానించింది. పూలమాలతో సింధును సత్కరించి.. పద్మభూషణ్‌ అవార్డు పొందినందుకు అభినందనలు తెలిపింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో హంటర్స్‌ టీమ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ అభిమానులు తమ టీమ్‌కు ఎంతగానో సపోర్ట్‌ చేశారని చెప్పారు. ఈ సీజన్‌లో సింధు సారథ్యంలో హంటర్స్‌ టీమ్‌ పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేటీఆర్‌ తమకు ఎంతగానో సపోర్టుగా నిలిచారని పేర్కొన్నారు.







ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. హంటర్స్‌ తరఫున ఆడటం సంతోషంగా ఉందన్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. అభిమానులు భారీగా తరలివచ్చి హంటర్స్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి మాట్లాడుతూ.. హంటర్స్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింధుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించిన సంగతి తెలసిందే.